తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించిన పాపం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిదే అని.. ఆయన ప్రజలకు క్షమాపన చెప్పాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడే తన బంధువులైన వై.వీ.సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలను టీటీడీ చైర్మన్లుగా, తనకు అనుకూలమైన అధికారి ధర్మారెడ్డిని ఈవోగా నియమించారని తెలిపారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యి విషయంలో జగన్ అన్నీ అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి భక్తులు ఆందోళనకు గురయ్యారన్నారు. నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతానని.. బయట ఇతర మతాలను గౌరవిస్తానని చెప్పిన జగన్.. డిక్లరేషన్ సంతకం చేసే ధైర్యం లేకనే తిరుమలకు వెళ్లలేదని ఎద్దేవా చేశారు. తిరుమలకు వెళ్లకుండా ప్రెస్ మీట్ పెట్టి.. బీజేపీ నాయకులను విమర్శిస్తున్నారని పేర్కొన్నారు.