టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య కుదరబోయే పొత్తును నీలి మీడియా బృందం, వైకాపా నాయకులు ఆపలేరని, టీడీపీ – జనసేన మధ్య కుదిరిన పొత్తును వారు ఏమి చేయలేరని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు అన్నారు. టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ పొత్తు ఖాయమని ఆయన తేల్చి చెప్పారు. తాను మూడు పార్టీల మధ్య చెలిమిని కోరుకుంటున్నానని వెల్లడించారు.ఒక నీలి మీడియా ఛానల్ టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి ప్రయాణం చేస్తాయనే వార్త కథనాన్ని ప్రసారం చేసిందని, ఈ విషయాన్ని తాను మొదటి నుంచి చెబుతూనే ఉన్నానని తెలిపారు.
భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజలను కోరారని, అయితే పవన్ కళ్యాణ్ 50 వేల మెజారిటీతో భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో అద్వితీయమైన విజయం సాధిస్తారని తాను చెప్పానని అన్నారు. టీడీపీ, జనసేన కూటమితో ఇప్పటి వరకు నీ వాళ్లు అని భావించిన వారు కూడా కలుస్తారని నేను ముందే చెప్పానని, టీడీపీ, జనసేనతో పొత్తుకు బీజేపీ నాయకత్వం 12 అసెంబ్లీ స్థానాలు, ఆరు పార్లమెంటు స్థానాలను కోరుతున్నట్లుగా నీలి మీడియా ఛానల్ తన వార్తా కథనంలో ప్రసారం చేసిందని, ఈ విషయం నిజమా?, కాదా అన్నది పక్కన పెడితే… వైకాపా నాయకత్వం ఉలిక్కిపడిందని అన్నారు.