ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో ఏపీలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. రాజకీయ నేపథ్యమున్న కుటుంబంలోనే పుట్టిపెరిగినా ఏనాడూ పాలిటిక్స్ వైపు తొంగిచూడని నారా భువనేశ్వరి భర్త అరెస్టుతో రోడ్డుపైకి వచ్చారు. ఇలా భర్త జైల్లో వుండటంతో బాధపడుతున్న ఆమెను పరామర్శించేందుకు వెళుతున్న అమరావతి మహిళా రైతులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మహిళలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగి తోపులాట చోటుచేసుకుంది.
రాజమండ్రిలో ఉన్న భువనేశ్వరిని కలిసేందుకు అమరావతి మహిళా రైతులు ప్రత్యేక బస్సులో బయలుదేరారు. అయితే వీరిని వీరవల్లి, నల్లజర్ల టోల్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రాజమండ్రికి వెళ్లేందుకు అనుమతి లేదంటూ.. బస్సును నిలిపి వేసి డ్రైవర్ ను బలవంతంగా కిందకు దించారు. మహిళా రైతులను మాత్రం బస్సులోనే నిర్భంధించారు. బస్సు డోర్ కు అడ్డంగా నిలబడ్డ పోలీసులను తోసుకుంటూ కిందకు దిగేందుకు మహిళలు ప్రయత్నించడంతో తోపులాట చోటుచేసుంది.