రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మున్సిపల్ కార్యాలయంలో డబుల్ బెడ్ రూమ్ లబ్దిదారులు ధర్నాకు దిగారు. నడిరోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం అర్హులైన వారికి ఇవ్వకుండా ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఉన్నవారికే డబుల్ బెడ్ రూమ్ లను కేటాయిస్తుందని మండిపడ్డారు.
స్థానికులకు కాకుండా వేరే ప్రాంతం వారికి ఇండ్లు కేటాయించడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం అప్లై చేసి ఎన్ని సంవత్సరాలైన ఇప్పటివరకు ఇండ్లు రాలేదని.. ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇకనైనా తమకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని కోరారు. లబ్దిదారుల నిరసనతో రాజేంద్రనగర్ ఆఫీస్ పరిధిలో రెండు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో ఉన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నిస్తున్నారు.