గాంధీ జయంతి రోజునే క్షమబిక్ష ఖైదీలు విడుదల చేస్తామని ఏపీ హోంమంత్రి అనిత వెల్లడించారు. ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జైలును సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి తప్పు చేయకుండా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని 53రోజులు రాజమండ్రి జైలులో ఉంచారు. ఇవాళ పరిస్థితులు తారుమారు అయ్యాయని చెప్పారు. క్షమబిక్షపై ఖైదీల విడుదల ఆగస్టు 15న ఉండబోదని స్పష్టం చేశారు హోంమంత్రి.
కొన్ని ఫైల్స్ పరిశీలించాల్సి ఉన్న కారణంగా కొంత సమయం ఆలస్యం అవుతుందని వెల్లడించారు హోంమంత్రి అనిత. మాజీ సీఎం జగన్ సెక్యూరిటీని మేము తగ్గించలేదని.. పులివెందుల ఎమ్మెల్యేకు నిబంధనల మేరకే భద్రత కొనసాగుతుందని పేర్కొన్నారు. అనవసరంగా భద్రత కుదించారని జగన్ రాద్దాంతం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ కి 900 మంది సెక్యూరిటీ కావాలా..? అని ప్రశ్నించారు. సెక్యూరిటీ లేకపోతే ప్రజలు తిరగబడతారని జగన్ భయపడుతున్నారా..? అని విమర్శించారు. రాష్ట్రంలో 20వేల మంది పోలీసుల కొరత ఉండగా.. జగన్ కి 900 మంది సెక్యూరిటీ కల్పించడం ఎలా అని ప్రశ్నించారు.