మత ప్రచార సంస్థ ట్రస్ట్ ముసుగులో నిర్వహిస్తున్న ఆశ్రమంలో చేరిన ముగ్గురు ఆదివాసీ పిల్లలు కలుషిత ఆహారానికి బలైపోయారు. వసతిగృహ నిర్వాహకుడి నిర్లక్ష్యానికి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. మరో 35 మందికి పైగా పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో ఈ విషాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ‘బువ్వ పెడతాం, బడికి పంపి అక్షరాలు నేర్పుతాం.. మా దగ్గరకు పంపండి అంటే పిల్లల బతుకు బాగుపడుతుందని తల్లిదండ్రులు ఆశపడి పంపితే తమకు కడుపుకోత మిగిలిందని ఆ పిల్లల కన్నవాళ్లు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వసతిగృహాన్ని సీజ్ చేసి నిర్వాహకుణ్ని అరెస్టు చేశారు. ఆయనపై హత్య కేసు నమోదు చేశారు. అయితే అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం అరట్లకోటకు చెందిన పాస్టర్ ముక్కుడుపల్లి కిరణ్‌కుమార్ కోటవురట్ల మండలం కైలాసపట్నం పరిశుద్ధాత్మ అగ్నిస్తుతి ఆరాధన ట్రస్ట్ (పాస) పేరుతో ఓ అనాథాశ్రమం నిర్వహిస్తున్నాడు. ట్రస్ట్‌గా రిజిస్ట్రేషన్ చేసుకున్నా వసతిగృహం నిర్వహణకు అనుమతులు తీసుకోలేదని పోలీసులు గుర్తించారు.