బెజవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ శరన్నవరాత్రులు, దసరా మహోత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. అయితే మూడేళ్లుగా జరగని తెప్పోత్సవం ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేవాదాయశాఖ. సువర్ణ కాంతుల విద్యుత్ దీపాలంకరణలో… మిరమిట్లు గోలిపే బాణాసంచా వెలుగులు.. రంగురంగుల హంస వాహనంపై కృష్ణమ్మ వడిలో విహరించారు ఆదిదంపతులు దుర్గా మల్లేశ్వరస్వామి వారు. మంగళ వాయిద్యాలు వేదమంత్రాలు సాంస్కృతిక కళా ప్రదర్శనలు భక్తకోటి జయ జయ రాగాలు ప్రత్యేక పూజల మధ్య కృష్ణానదిలో హంస వాహనంపై ఊరేగించారు.
ఈ తెప్పోత్సవం ప్రజెంట్, మాజీ దేవాదాయశాఖమంత్రికి మధ్య వివాదానికి దారితీసింది. గతంలో హంసవాహన సేవలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఈవో, కలెక్టర్ సహా వీఐపీలకు అనుమతి ఉండేది. ఈసారి తెప్పోత్సవంలో మార్పులు చేశారు అధికారులు. హంస వాహనంపై ప్రజా ప్రతినిధులు, అధికారులకు ప్రవేశం లేదంటూ తెప్పోత్సవానికి ముందే అధికారుల సమీక్షలో నిర్ణయించారు. కృష్ణానదిలో విహరించేందుకు ప్రజాప్రతినిధులకు, అధికారులకు హంసవాహనంపై కాకుండా దాని వెనకాలే బోదిసిరి బోటును ఏర్పాటు చేశారు. అయితే మొదట హంస వాహనంలో విహరించేందుకు నిర్ణయించుకున్న.. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు బోదిసిరి బోటుకు సంబంధించిన పాస్‌లు అందడంతో అలకబూనారు. తన దగ్గరకు చేరిన బోదిసిరి బోటు పాస్‌లను వెనక్కి తిప్పిపంపారు. దీంతో వివాదం మొదలైంది.