ఓ గర్భిణి ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. కానీ ఆ నలుగురు పసిపాపలు గంటల వ్యవధిలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ విషాద ఘటన జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో చోటు చేసుకుంది. కుప్వారా జిల్లాలోని కేరాన్ గ్రామానికి చెందిన కలీదా బేగం గర్భిణి. ఆమెకు నొప్పులు రావడంతో ఆదివారం సాయంత్రం స్థానికంగా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్‌కు వెళ్లింది. పరీక్షించిన వైద్యులు.. కాన్పు ఇక్కడ చేయడం సాధ్యం కాదని, కుప్వారా జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాలని కలీదా కుటుంబ సభ్యులకు సూచించారు.
ఇక కుప్వారా జిల్లా ఆస్పత్రిలో కలీదా నార్మల్ డెలివరీ ద్వారా నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. నలుగురిలో ముగ్గురు అమ్మాయిలు కాగా, ఒకరు అబ్బాయి. శిశువులందరూ తక్కువ బరువుతో జన్మించారు.
అయితే ముగ్గురు అమ్మాయిలు కుప్వారా ఆస్పత్రిలోనే మరణించారు. దీంతో మెరుగైన చికిత్స నిమిత్తం తల్లీ, అబ్బాయిని శ్రీనగర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ బాబు కూడా చనిపోయాడు. ఇలా గంటల వ్యవధిలోనే నలుగురు శిశువులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కలీదాతో పాటు ఆమె కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కలీదా ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.