ఏపీలో నాటుసారా, గంజాయి రవాణా, సరఫరాపై ముఖ్యమంత్రి జగన్ ఉక్కుపాదం మోపుతున్నారు. నాటుసారా, గంజాయి నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని అధికారులను ఆదేశించారు. నాటుసారా తయారు చేస్తున్న వారిని ఆ ఊబిలోంచి బయటకు లాగాలని జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు స్వయం ఉపాధి కల్పించాలని సూచించారు. వారికి గౌరవప్రదమైన ఆదాయం వచ్చేలా చూడాలని ఆదేశించారు.
రాష్ట్రంలో మద్యం ధరలు షాక్ కొట్టేలా పెట్టడంతోపాటు, బెల్ట్‌షాపులు ఎత్తివేయడంతో వినియోగం బాగా తగ్గిందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. నాటు సారా తయారు చేస్తున్నవారిని దాని నుంచి బయట పడేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే శాఖలపై ముఖ్యమంత్రి గురువారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్షించారు. రాష్ట్రంలో 2018-19లో 384.31 లక్షల కేసుల మద్యం విక్రయించగా, 2021-22లో ఆ సంఖ్య 278.5 లక్షలకు తగ్గిందని అధికారులు వివరించారు. 2018-19లో 277.10 లక్షల కేసుల బీరు విక్రయాలు జరగ్గా, 2021-22లో 82.6 లక్షలకు తగ్గిందన్నారు.