ఏపీ యువతకు గుడ్న్యూస్. కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు షురూ చేసింది. దీనికి సంబంధించి కోర్టుల్లో పలు కేసులున్నందున న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుని తదుపరి కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది. ఆగస్టు నెలాఖరులోగా నియామక ప్రక్రియ పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
2022 నవంబరు 28న 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అప్పటి జగన్ సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం గతేడాది జనవరి 22న నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షకు 4,58,219 మంది హాజరయ్యారు. వారిలో 95,208 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. గతేడాది ఫిబ్రవరి 5న ఈ ఫలితాలు విడుదలయ్యాయి. వీరందరికీ రెండో దశలో దేహదారుఢ్య, శారీరక సామర్థ్య (పీఎంటీ, పీఈటీ) పరీక్షలు నిర్వహించాలి. గతేడాది మార్చి 13 నుంచి 20వ తేదీ వరకూ నిర్వహిస్తామంటూ తొలుత షెడ్యూల్ విడుదల చేసి హాల్‌టికెట్లూ జారీ చేశారు. చివరికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సాకుతో వాయిదా వేశారు. ఆ తర్వాత పలు కారణాలతో వాయిదా పడటంతో తాజాగా ఎన్డీయే ప్రభుత్వం ఈ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది.