ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫైబర్ నెట్ లో ఇప్పటివరకు 600 మందిని తొలగించాం.. త్వరలోనే సంస్థ విస్తరణ చేయనున్నామని తెలిపారు. సంస్తలో తొలగించిన వారి స్థానంలో మళ్లీ ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. ఈసారి రాజకీయ కొలువుల మాదిరిగా కాకుండా పారదర్శకంగా చేస్తామని చెప్పారు. త్వరలోనే సంస్థలో నియామకాలు ఉంటాయన్నారు. కేబుల్ ఆపరేటర్ల మీద గత ప్రభుత్వ హయాంలో రూ.100 కోట్లు జరిమానా వేశారు. ఇది కక్ష పూరితంగా జరిగిందని ఫిర్యాదులు వచ్చాయని.. దీనిపై విచారణ జరిపి అడ్డగోలుగా వేసిన జరిమానాలను రద్దు చేయాలని నిర్ణయించామని జీవీరెడ్డి తెలిపారు.
కేబుల్ ఆపరేటర్ల నుంచి కనెక్షన్ల నుంచి రెంట్ వసూలు చేశారు. ఈ కనెక్షన్ల మీద వసూలు చేసిన రెంట్లు రద్దు చేయాలని నిర్ణయించామని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ తెలిపారు. బినామీలతో అడ్డగోలుగా కాంట్రాక్టులు గత ప్రభుత్వ హయాంలో అప్పజెప్పారు. రూపాయికి రూ.10 చెల్లింపులు జరిగాయని ఆరోపించారు. ఇప్పటివరకు ఉద్యోగాలను తొలగించినా.. ఒక్కరూ కూడా వచ్చి అడిగిన పరిస్తితి లేదని తెలిపారు. దీనిని బట్టే అన్నీ గతంలో నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగాయనేది స్పష్టం అయిందని వెల్లడించారు. గ్రామాల్లో అందరికీ తక్కువ ధరకు ఇవ్వాలనే బేసిక్ ఫ్యాకేజ్ అందుబాటులోకి తెస్తామని జీవీరెడ్డి తెలిపారు.