ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలపడంతో న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభాదేవి ఉత్తర్వులిచ్చారు. ఇటీవల ముసాయిదా ఆర్డినెన్సుకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే కేబినెట్ భేటీలో ఎస్సీ వర్గీకరణ అంశంపై చర్చ జరిగింది.
రాష్ట్రాన్ని యూనిట్‌గా వర్గీకరణ చేయాలని రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. జిల్లాను యూనిట్‌గా వర్గీకరణ చేయాలన్న ఎమ్మెల్యేల ప్రతిపాదనపై చర్చించింది. ఈ నేపథ్యంలోనే 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రం యూనిట్‌గా వర్గీకరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2026 జనాభా లెక్కలు వచ్చాక జిల్లా యూనిట్‌గా వర్గీకరణ చేపట్టాలని నిర్ణయించింది. మరోవైపు బుడగజంగాలు, మరో కులాన్ని ఎస్సీల్లో చేర్చేందుకు తీర్మానం చేయాలని నిర్ణయం తీసుకుంది.