పశ్చిమబెంగాల్లో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో పని చేస్తున్న 25,753 మంది టీచర్లు, ఇతర సిబ్బంది నియామకం చెల్లుబాటు కాదంటూ ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో కొందరు టీచర్లకు తాజాగా న్యాయస్థానం స్పల్ప ఊరట కల్పించింది. నియామక ప్రక్రియ ద్వారా ఎంపికైన వారు, ఎలాంటి ఆరోపణలు లేని వారు, 9-12 తరగతి విద్యార్థులకు బోధించే టీచర్లను కొనసాగించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కొత్త నియామక ప్రక్రియ పూర్తయ్యేవరకు వారు బోధన కొనసాగించొచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు మే 31వ తేదీలోగా కొత్త రిక్రూట్మెంట్ డ్రైవ్ కోసం ప్రకటన ఇవ్వాలని బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్కు గడువు విధించింది. ఎంపిక ప్రక్రియ డిసెంబర్ 31లోగా పూర్తి కావాలని.. దీనికి సంబంధించి మే 31లోగా రాష్ట్ర ప్రభుత్వం, కమిషన్ అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక మానవీయ కారణాలరీత్యా కొందరు దివ్యాంగులకు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఈ తీర్పు నుంచి మినహాయింపు ఇచ్చి వారు ఉద్యోగంలోనే ఉంటారని గత తీర్పులోనే స్పష్టం చేసింది.