బిగ్​బాస్ షోపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

-

బిగ్‌బాస్‌ రియాల్టీ షోపై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. కార్యక్రమం ప్రసారానికి ముందు సెన్సార్‌షిప్‌ చేయకపోతే ఎలాగని ప్రశ్నించింది. ప్రసారం అయ్యాక దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అందే ఫిర్యాదులను పరిశీలించడం ‘పోస్టుమార్టం’ చేయడం లాంటిదని ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రస్తుతం షో ప్రసారం కావడం లేదన్న కారణంతో ఈ వ్యవహారంపై న్యాయస్థానం కళ్లు మూసుకుని ఉండలేదని పేర్కొంది. కేంద్రానికి తగిన సూచనలు ఇచ్చే విషయాన్నీ పరిశీలిస్తామని చెప్పింది.

పూర్తి వివరాలతో కౌంటరు వేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌, స్టార్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ మాటీవీ, ఎన్‌డేమోల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌, సినీ హీరో అక్కినేని నాగార్జునలను ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. అశ్లీలతను ప్రోత్సహించేదిగా బిగ్‌బాస్‌ షో ఉందంటూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దాఖలు చేసిన రెండు ప్రజాహిత వ్యాజ్యాలపై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది.

Read more RELATED
Recommended to you

Latest news