నిన్నటి దాకా మండే ఎండలు, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు రెండ్రోజుల నుంచి కాస్త ఉపశమనం పొందుతున్నారు. వాతావరణం కాస్త చల్లబడటంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణలో రెండ్రోజుల నుంచి పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఏపీలోని ఉత్తర కోస్తాలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో బుధవారం రోజున భారీ వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.
దక్షిణ తమిళనాడు నుంచి అంతర్గత కర్ణాటక మీదుగా.. పశ్చిమ విదర్భ, పొరుగు ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు ఒక ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది ఝార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా వరకు మరో ద్రోణి వ్యాపించిందని తెలిపింది. వీటి ప్రభావంతో రేపు అల్లూరి సీతారామరాజు, డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.