‘ఆప్’ కు కవిత రూ.100 కోట్లు చెల్లించారు.. ఈడీ కీలక ప్రకటన

-

దిల్లీ లిక్కర్ పాలసీలో పొందిన ప్రయోజనాలకు ప్రతిఫలంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆప్‌ నేతలకు రూ.100 కోట్లు చెల్లించడంలో భాగస్వామి అయ్యారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తెలిపింది. హైదరాబాద్‌లో ఈ నెల 15న ఆమెను అరెస్ట్‌ చేసిన ఈడీ సోమవారం రోజున అందుకు సంబంధించిన వివరాలతో పత్రికా ప్రకటన విడుదల చేసింది. కేజ్రీవాల్, సిసోదియాతో కలిసి కవిత కుట్ర పన్నారన్న ఈడీ.. 2021-22 ఏడాదిలో మద్యం కుంభకోణానికి పాల్పడ్డారని వెల్లడించింది.

మద్యం పాలసీని నిబంధనలకు విరుద్ధంగా రూపొందించారన్న పేర్కొన్న ఈడీ హోల్‌సేల్‌ డీలర్ల నుంచి వచ్చిన డబ్బును వాటాలుగా పంచుకున్నారని తెలిపింది. ఒక నేరాభియోగపత్రం, 5 అనుబంధ పత్రాలు దాఖలు చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.  ఇప్పటివరకు దిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబయి సహా 245 ప్రాంతాల్లో సోదాలు చేసినట్లు ఈడీ పేర్కొంది. దిల్లీ మద్యం కేసులో ఇప్పటివరకు 15 మందిని అరెస్టు చేశామని,  128.79 కోట్ల నగదు సీజ్ చేశామని ప్రెస్‌నోట్‌లో తెలిపింది. సిసోదియా, సంజయ్‌సింగ్, విజయ్‌నాయర్‌ సహా 15 మందిని అరెస్టు చేశామని..  హైదరాబాద్‌లోని కవిత ఇంట్లో ఈ నెల 15న సోదాలు చేశామని వెల్లడించింది. ఆప్ నేతలతో కలిసి కవిత అక్రమాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news