ఎన్నికల వేళ ఏపీలో వాతావరణం కాస్త చల్లబడింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రాబోయే అయిదు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఆదివారం కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వాన పడుతుందని చెప్పారు. ఎన్నికల వేళ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు వర్షాలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపిస్తాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు.