బాలీవుడ్ నటి కరీనా కపూర్‌కు మధ్యప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది. 2021లో ఆమె రాసిన ‘కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్: ది అల్టిమేట్ మ్యానువల్ ఫర్ మామ్స్ టు బి’ పుస్తకం వ్యవహారంలో ఆమెకు నోటీసులు జారీ చేసింది. బైబిల్ పదాన్ని తొలగించాలంటూ న్యాయవాది క్రిస్టఫర్ అంథోనీ వేసిన పిటిషన్‌లో భాగంగా ఈ నోటీసులను పంపింది.
బుక్ టైటిల్లో బైబిల్ అనే పదం క్రిస్టియన్ల మనోభావాలను దెబ్బతీస్తోందని ఆరోపిస్తూ తొలుత ఆయన ట్రయల్ కోర్టును ఆశ్రయించగా.. కేసుకు సంబంధించి పోలీసులు విచారణ నివేదికను సమర్పించకపోవడంతో 2022 ఫిబ్రవరి 26వ తేదీన కోర్టు ఈ అభ్యర్థనను కొట్టివేసింది. దీనిని సవాలుచేస్తూ అనంతరం ఆయన హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేయగా.. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ జి.ఎస్.అహ్లువాలియా బెంచ్ కరీనా కపూర్, సహ రచయిత్రి అతిథి షా భింజ్యాని, అమెజాన్ అన్‌లైన్ షాపింగ్, జగర్నాట్ పబ్లిషింగ్ కంపెనీ, రాష్ట్ర ప్రభుత్వం, జబల్‌పుర్ ఎస్పీ, ఒమిటి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జికి నోటీసులు పంపింది.