- ఏపీ రాష్ట్ర మాజీ మంత్రి, టీడీపీ నేత కళా వెంకట్రావు
అమరావతిః గత కొంత కాలంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దేశంలో ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపుతూ.. వివిధ రాష్ట్రాల్లోని ప్రతిపక్ష పార్టీలు సహా అధికార పార్టీలను సైతం ఇరుకును పెట్టే ప్రయత్నాలు చాలానే చేస్తున్నదనే ఆరోపణలు ఎక్కువగానే వినిపిస్తున్నాయి. దీనికి అనుగుణంగా బీజేపీ తీరు కూడా నడుస్తున్నదని ఇటీవల పలు సంఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కర్నాటక, బెంగాల్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో బీజేపీ వలసలను ప్రొత్సహిస్తూ.. ఆయా రాష్ట్రాలల్లోని ప్రధాన పార్టీలకు చెందిన పలువురు నేతలను కమళం గూటికి చేరేలా చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఆపరేషన్ ఆకర్ష్ కు బీజేపీ తెరలేపుతున్నదని పెద్ద ఎత్తున్న ప్రచారం సాగుతోంది. తెలంగాణలో ఇటీవల పలువురు ఇతర పార్టీల నేతలు బీజేపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో టీడీపీ కీలక నేత, ఏపీ రాష్ట్ర మాజీ మంత్రి కళావెంకట్రావు బీజేపీలో చేరబోతున్నారనే వార్త ఆంధ్రప్రదేశ్‌లో తెగ హల్ చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే దీనిపై స్పందించిన కళా వెంకట్రావు.. తాను టీడీపీని వీడి, బీజేపీలో చేరబోతున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని వెల్లడించారు. తాను టీడీపీలోనే తుదిశ్వాస వరకూ కొనసాగుతానని స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుతోనే తన రాజకీయ ప్రయాణం కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సైతం బీజేపీలో చేరబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న టీడీపీకి.. కమళం ఆపరేషన్ ఆకర్ష్.. సైకిల్ శ్రేణులను తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోందని తెలుస్తోంది.