ప్రస్తుతం రోజు రోజుకు టెక్నాలజీ పెరుగుతున్న కాలంలో కూడా కొన్ని సంఘటనలు చూస్తే.. ఇంకా వెనుకబడి పోతున్నామా..? అనిపించక మానదు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా పాత కాలం నాటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పోలీసులు, రాజకీయ నాయకులు ఎంత అవగాహన కల్పించినా వారిలో మార్పు రావడం లేదు. తాజాగా ఇలాంటి ఘటన ఏపీలోని కాకినాడ జిల్లా ఉప్పుమిల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
ఏకంగా ఏడు కుటుంబాలను గ్రామ పెద్దలు వెలివేశారు. గ్రామస్తులు ఎవ్వరూ కూడా వారికి సహకరించకూడదని.. శుభకార్యాలకు వెళ్లకూడదని, వారిని పనులకు పిలవకూడదని కఠినమైన ఆదేశాలు జారీ చేసారు. ఈ వెలివేత పై కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో బాధితుడు మేడిశెట్టి దుర్గారావు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న కాజులూరు తహసీల్దార్, గొల్లపాలెం ఎస్ఐ గ్రామానికి వచ్చి పరిస్తితిని తెలుసుకున్నారు. ఇరు వర్గాల మధ్య రాజీ చేసే దిశగా రెవెన్యూ, పోలీసు అధికారులు చర్చలు జరిపారు.