దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. కర్ణాటకలో తన వ్యూహం బెడిసికొట్టిన తర్వాత ఇప్పుడు తెలంగాణపై తన ఫోకస్ పెట్టింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సీఎం కేసీఆర్ ను గద్దె దించాలనే ప్రయత్నంలో ఉంది. ఆ దిశగా వ్యూహాలు రచిస్తూ.. పార్టీని బలోపేతం చేస్తోంది. కేవలం తెలంగాణలోనే కాదు ఏపీలోనూ తమ సత్తా చూపించాలనే యోచనలో ఉంది బీజేపీ. ఆ దిశగా నెమ్మదిగా తన వ్యూహాన్ని పదును పెట్టుకుంటోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.. ఈనెల 21న అమరావతికి వెళ్లనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పార్టీకి సంబంధించిన ఓటర్ల నమోదు ప్రక్రియను ఆయన సమీక్షించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ, ఏపీతో పాటు మహారాష్ట్ర, గోవా, ఒడిశా ఓటర్ల నమోదు ప్రక్రియను సమీక్షించే బాధ్యతను పార్టీ అధిష్ఠానం బండి సంజయ్‌కు అప్పగించింది. అయితే, బండి సంజయ్ ఎంట్రీతో ఏపీ రాజకీయం రసవత్తరంగా మారనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణతో పాటు ఏపీలోనూ బండి సంజయ్ సేవలను ఉపయోగించుకోవాలని అక్కడి పార్టీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఏదైతేనం బండి సంజయ్ రాక సమాచారంతో ఏపీ బీజేపీలో నయా జోష్ వచ్చిందని రాజకీయ వర్గాల్లో టాక్.