ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హాట్ టాపిక్‌గా మారిన సెగ్మెంట్ పిఠాపురం. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేయడంతో ఈ నియోజకవర్గం పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసిన జనసేనాని.. రెండు చోట్లా ఓడిపోయారు. ఈసారి మాత్రం వ్యూహాత్మకంగా పిఠాపురాన్ని ఎంచుకున్నారు. కాపు సామాజికవర్గంతో పాటు మెగాభిమానులు పెద్ద సంఖ్యలో ఉండటంతో బాగా ఆలోచించి పిఠాపురం నుంచి పవన్ బరిలో నిలిచారు.
పవన్ కోసం మెగా ఫ్యామిలీ, సినీ పరిశ్రమ కదిలొచ్చింది. నాగబాబు, వరుణ్ తేజ్, సాయిథరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, జానీ మాస్టర్, ఆర్కే సాగర్ తదితరులు ప్రచారం నిర్వహించారు. ఆయనను ఓడించేందుకు వైసీపీ అధినేత, సీఎం జగన్ సైతం అదే స్థాయిలో వ్యూహాలు అమలు చేశారు. వైసీపీ నుంచి పోటీ చేసిన గీత కూడా పవన్‌కు గట్టిపోటీ ఇచ్చారని విశ్లేషకులు అంటున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమంటున్నారు. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. పవన్ గెలుస్తారని తన యావదాస్తిని పందెం కాస్తానని, డౌట్ ఉంటే ఎవరైనా కాగితాలు తీసుకుని రావొచ్చునని వర్మ సవాల్ విసిరారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.