పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర అడ్డుకునేందుకు పోలీస్ చట్టం 30 అమలు చేసేందుకు జగన్ సర్కార్ ఆలోచన చేస్తోంది. అయితే.. దీనిపై స్పందించారు రఘురామకృష్ణ రాజు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర సందర్భంగా ఉభయగోదావరి జిల్లాలో పోలీస్ చట్టం 30ని అమలు చేస్తామని చెప్పడం దారుణమని ఎంపీ రఘురామకృష్ణ రాజు పేర్కొన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉందని న్యాయస్థానం కొట్టివేసిందని, అన్నవరం నుంచి భీమవరానికి తలపెట్టిన వారాహి యాత్రకు, గతంలో నారా లోకేష్ గారు నిర్వహిస్తున్న యువ గళం పాదయాత్రకు కల్పించినట్లే రాష్ట్ర ప్రభుత్వం ఆటంకాలను కల్పించాలని చూస్తుందని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు.
ప్రతిపక్ష నాయకులు ప్రజల మధ్య ఉంటామని చెబితే స్వాగతించాల్సింది పోయి, అడ్డంకులు సృష్టించడం సిగ్గుచేటని, గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాగే వ్యవహరించి ఉంటే జగన్ మోహన్ రెడ్డి గారు పాదయాత్ర నిర్వహించి ఉండేవారా? అని ప్రశ్నించారు. వారాహి యాత్ర లక్షలాది మంది అభిమానుల హర్షద్వానాల మధ్య, స్వాగత తోరణాల మధ్య విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.