అమరావతి అసైన్డ్ భూముల కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో సీఐడీకి సరికొత్త ఆధారాలు లభించాయి. అమరావతి అసైన్డ్ భూముల కేసును మళ్ళీ ఓపెన్ చేస్తూ హై కోర్టులో ఆంధ్రప్రదేశ్ సీఐడీ రెండు పిటిషన్లు ఫైల్ చేసింది. ఈ మేరకు సీఐడీకి మాజీ మంత్రి నారాయణ మరదలు పొంగూరు కృష్ణప్రియ ఆడియో, వీడియో ఆధారాలు అందజేశారు.
ఇందులో నారాయణ, తదితరులు ఏ విధంగా అక్రమంగా భూములు కొనుగోలు చేసిందని..ఎసైన్డ్ భూములున్న దళితులు, ఇతర బలహీనవర్గాలవారిని అధికార దర్పంతో బలంతో ఏ విధంగా బెదిరించినది…ఏ విధంగా వాటిని కాజేసినదీ కృష్ణప్రియ వివరించారు. ఈ నేపథ్యంలో కేసును రీ – ఓపెన్ చేస్తూ కోర్టులో పిటిషన్ వేశారు. వాస్తవానికి ఆ భూముల విషయంలో తాము ఎలాంటి అక్రమాలకూ పాల్పడలేదని పేర్కొంటూ ఈ కేసును కొట్టేయాలని గతంలోనే కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో విచారణ ముగియగా తీర్పును హైకోర్టు ఈనెల 16వ తేదికి వాయిదా వేసింది. ఎల్లుండి సోమవారం తీర్పు రానున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ కేసును రీ ఓపెన్ చేయాలంటూ సీఐడీ పిటిషన్ వేయడం నారాయణకు కొత్త చిక్కులు తెచ్చింది.