పేదల ఇళ్ల స్థలాలు, కాలనీలు ఎలా ఉన్నాయో ప్రపంచానికి చూపిద్దామన్నారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. పేదలకు ఇళ్ల పేరుతో వైసీపీ చేసిన స్కామ్ ని ప్రజలకు తెలియచేద్దామన్నారు. జగనన్న కాలనీల ముసుగులో వైసీపీ ప్రభుత్వం చేసిన అతి పెద్ద కుంభకోణాన్ని బయట పెట్టాలన్నారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలంతా తమ తమ ప్రాంతాల్లోని జగనన్న కాలనీలు సందర్శించాలని సూచించారు.
అక్కడ పరిస్థితులను ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియ చేయాలన్నారు. నిరుపయోగంగా ఉన్న భూములు తక్కువ ధరకు కొనుగోలు చేసి.. ఆ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు ఎక్కువ ధరకు ప్రభుత్వానికి అమ్మేసుకున్నారని ఆరోపించారు. కొన్ని ప్రాంతాల్లో చెరువుల్ని సైతం ఆక్రమించేసి ప్రభుత్వానికి ఇళ్ల స్థలాలకు అమ్మి సొమ్ము చేసుకున్నారని అన్నారు.
మౌలిక వసతుల కల్పన పేరిట రూ. 89 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటనలు చేస్తోందని.. ఆ కోట్లు ఎటు పోతున్నాయని ప్రశ్నించారు. ప్రతి జగనన్న కాలనీలో రోడ్లు, వీధి దీపాలు, పార్కులు, గ్రంథాలయం, అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మిస్తామని రకరకాల కబుర్లు చెప్పి ప్రజల్ని మోసం చేస్తూనే ఉందన్నారు. మౌలిక వసతుల పేరిట చేసిన మోసాన్ని ప్రజలకు తెలియచేద్దామన్నారు.