వివేకా కేసుపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. దొరికి పోయిన దొంగల బండారం సీబీఐ బయటపెట్టినా జగన్ మౌనాన్నీ వీడకపోవడంలోని ఆంతర్యం ఏమిటి? అని ఫైర్ అయ్యారు. జగన్ చెల్లి షర్మిల, మరోచెల్లి సునీతల వాంగ్మూలాలు, సీబీఐ తేల్చిన విషయాలతో ప్రజలకు వాస్తవాలు తెలిసినా జగన్ స్పందించడా? సీబీఐ ఛార్జ్ షీట్ లోని అంశాలపై జగన్ మౌనం అర్థాంగీకారమనుకోవాలా? అని ప్రశ్నించారు.
అవినాశ్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేసిన వారంతా తాడేపల్లి ప్యాలెస్ వదిలి జైలు కెళ్లాల్సిన సమయం వచ్చిందని వివరించారు. సునీత, షర్మిల సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంపై ముఖ్యమంత్రి ఏం చెబుతాడు? అని ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో వేసిన ఛార్జ్ షీట్లు మొత్తం వెనక్కు తీసుకుంటే, రూ.500 కోట్లు ఇస్తామని సునీతకు ఆఫర్ ఇచ్చింది నిజమా..కాదా? అని తెలిపారు. పులివెందులలో మెడికల్ కాలేజీ, భూములు, ఆస్తులు ఎరవేసింది వాస్తవమా..? కాదా? అని నిలదీశారు. సొంత మనుషులు ఇంత క్రిమినల్ మైండ్ తో ఉంటారని ఊహించలేకపోయానన్న సునీత వ్యాఖ్యలు జగన్ నిజ స్వరూపానికి నిదర్శనమన్నారు. అధికారంతో ఇన్నాళ్లు అవినాశ్ రెడ్డిని రక్షించిన జగన్, కొద్ది నెలల్లో సర్వం కోల్పోయాక ఏం చేస్తాడు? అని ఫైర్ అయ్యారు.