ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ప్రసంగాల పుస్తకావిష్కరణ కార్యక్రమం అమరావతిలో జరిగింది. సీఎం 75వ పుట్టిన రోజు సందర్భంగా అసెంబ్లీ కమిటీ హాల్‌లో రెండు పుస్తకాలను రఘురామకృష్ణరాజు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఆవిష్కరించారు. జయప్రద ఫౌండేషన్ .. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చేసిన ప్రసంగాలను రెండు పుస్తకాలుగా ప్రచురించింది.
ఈ కార్యక్రమంలో పుస్తక రూపకర్త టీడీ జనార్ధన్ మాట్లాడుతూ.. ఐటీ విప్లవం వచ్చిన వెంటనే తెలుగు జాతికి దాని ఫలాలు అందించాలని భావించిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు. చంద్రబాబు ఆనాడు చేసిన కృషితో ప్రతి రైతు, ప్రతికూలీ, ప్రతి కార్మికుడి ఇంట్లో ఓ ఐటీ ఉద్యోగి వచ్చారని తెలిపారు. హైదరాబాదును సంపద ఉపాధి కేంద్రంగా మార్చిన చంద్రబాబు ఇప్పుడు అమరావతిని కూడా అలాగే నిర్మించ తలపెట్టారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో విద్యుతే లేదు అంధకారమే ఉండేదని అన్నారు.