వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మంగళగిరి పోలీస్ స్టేషన్ లో విచారణ హాజరయ్యారు. తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయం పై దాడి కేసులో విచారించాలని మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేయడతో ఆయన ఇవాళ విచారణకు హాజరయ్యారు. సజ్జల వెంట న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఉన్నారు. సజ్జలతో పాటు విచారణ అధికారి వద్దకు తనను కూడా అనుమతించాలని పొన్నవోలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వేలు చూపించి మరీ పోలీసులను బెదిరించారు. విచారణ సమయంలో న్యాయవాదులను పోలీసులు అనుమతించలేదు. దీనికి కోర్టు అనుమతి తప్పనిసరి.. ప్రస్తుతం విచారణకు సజ్జల మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు.
దీంతో సజ్జల ఒక్కరే పోలీస్ స్టేషన్ లోకి వెళ్లారు. మంగళగిరి డీఎస్పీ మురళీ కృష్ణ, గ్రామీణ సీఐ శ్రీనివాసరావు విచారించారు. సజ్జలకు న్యాయస్థానం అక్టోబర్ 24 వరకు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే.. 10న లుక్ ఔట్ నోటీసులు ఎలా ఇస్తారని న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. దాడి జరిగిన సమయంలో సజ్జల మంగళగిరికి 500 కి.మీ.దూరంలో ఉన్నారని కోర్టుకు ఆధారాలు కూడా సమర్పించామని సుధాకర్ రెడ్డి మీడియాకు తెలిపారు.