భారత్ లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. సొంత దేశాన్ని వదిలి భారత్ లో తలదాచుకుంటుండంతో ఆ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ నవంబర్ 18లోపు ఆమెను అరెస్ట్ చేసి తమ ఎదుట హాజరు పరచాలని ఐసీటీ చీఫ్ ప్రాసిక్యూటర్ మహ్మద్ తజుల్ ఇస్లాం అక్కడి అధికారులను ఆదేశించారు.
ఆమె పారిపోయే వచ్చే ముందు ప్రధాని బాధ్యతల్లో ఉన్న సమయంలో సంభవించిన మారణహోమం, ఇతర నేరాల ఆరోపణలపై హసీనాకు వ్యతిరేకంగా ఐసీటీకి 60 ఫిర్యాదులు అందాయి. వాటిపై ట్రైబ్యునల్ దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలో ఆమెను అరెస్టు చేయాలంటూ వారెంట్ జారీ చేసింది. గత ఆగస్టులో రిజర్వేషన్ల అంశంలో బంగ్లాదేశ్ లో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో వందల మందిప్రజలు హతమయ్యారు. ఈ క్రమంలో ఆగస్టు 5వ తేదీన మరోసారి పెద్ద ఎత్తున హింస చెలరేగింది. అదే సమయంలో ఆ దేశ ప్రధానిగా ఉన్న షేక్ హసీనా నివాసాన్ని ఆందోళనకారులు ముట్టడించి బీభత్సం సృష్టించారు. ఈ ముట్టడికంటే ముందే షేక్ హసీనా దేశం విడిచి పారిపోయి భారత్ కు వచ్చారు. ప్రస్తుతం ఆమె భారత్ లోనే ఆశ్రయం పొందుతున్నారు.