ప్రధాని నరేంద్ర మోదీ విజయవాడ పర్యటనలో భద్రతా లోపంపై కేంద్రం తీవ్రంగా ఫైర్ అయింది. మోదీ రోడ్‌షో మార్గంలోకి నిషేధాజ్ఞలు ఉల్లంఘించి రెండు డ్రోన్లు దూసుకొచ్చిన ఘటనను సర్కార్ తీవ్రంగా పరిగణించింది. అత్యంత కట్టుదిట్టమైన రక్షణలో ఉండే ప్రధాని పర్యటనలో చోటుచేసుకున్న ఈ ఘటనపై కేంద్రం సీరియస్ అయింది. భద్రతా లోపంపై ఏపీ డీజీపీ, సీఎస్‌లను వివరణ కోరింది.
ఈ నెల 8న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్‌లతో కలిసి ప్రధాన మంత్రి విజయవాడలో రోడ్‌షో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ రావడానికి 45 నిమిషాల ముందు రెండు డ్రోన్లు ఎగిరినట్లు కేంద్ర భద్రతా ఏజెన్సీ గుర్తించి హోంశాఖకు నివేదిక ఇచ్చింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర హోంశాఖ.. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రధాని భద్రతకు సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘించారని ఆక్షేపించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలనీ, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.