ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల దిల్లీ పర్యటన ముగిసింది. ఆదివారం ఉదయం 11.30 గంటలకు దిల్లీ నుంచి ఆయన రాష్ట్రానికి రానున్నారు. ఈ పర్యటనలో చంద్రబాబు.. ప్రధాని సహా ఐదుగురు కేంద్ర మంత్రులను కలిసి వారి దృష్టికి పలు అంశాలను తీసుకెళ్లారు. కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి చేసిన ప్రకటనలపై ప్రధానికి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపినట్లు సమాచారం.
మరోవైపు శనివారం సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ అయిన చంద్రబాబు.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి చేసిన కేటాయింపులకు సంబంధించిన నిధులను వేగంగా విడుదల చేయాలని కోరారు. పోలవరం, అమరావతి నిర్మాణ పనులు వేగంగా సాగేందుకు సహకారం అందించాలని.. పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులను వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి, విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అమరావతికి బడ్జెట్‌లో ప్రకటించిన ఆర్థిక సాయాన్ని సాధ్యమైనంత త్వరగా అందిస్తే రాజధాని నిర్మాణ పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి వీలవుతుందని కేంద్ర మంత్రులకు విన్నవించారు.
శనివారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను చంద్రబాబు కలిశారు. ఈ భేటీపై అమిత్ షా ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. రాష్ట్ర, దేశ సర్వతోముఖాభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలిపారు.