అలిపిరి వద్ద దాడి జరిగినప్పుడు తనను తిరుమల శ్రీవారే కాపాడారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. సతీమణి భువనేశ్వరి కలిసితో ఆయన తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అంతకుముందు వైకుంఠం కాంప్లెక్స్ వద్ద వారికి టీడీపీ అధికారులు స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం అనతరం రంగనాయకుల మండపంలో చంద్రబాబు దంపతులకు అర్చకులు వేదాశీర్వచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. చంద్రబాబు వెంట మాజీ మంత్రి అమర్నాథరెడ్డితో పాటు పలువురు నేతలు ఉన్నారు.
దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. అలిపిరి వద్ద దాడి జరిగినప్పుడు శ్రీవారే కాపాడారని అన్నారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. ప్రజలకు సేవ చేసే శక్తి, సామర్థ్యాలు ఇవ్వాలని శ్రీవారిని వేడుకున్నట్లు చెప్పారు.
“కష్టం వచ్చినప్పుడు స్వామివారిని మొక్కుకున్నాను. ధర్మాన్ని కాపాడాలని ప్రార్థించాను. ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో ఉండాలి. తెలుగుజాతి ప్రపంచంలోనే నంబర్ వన్‌గా ఉండాలి”’’ అని కోరుకున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.