ప్రపంచంలో మూడు రాజధానులు ఎక్కడా లేవని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల ముందు జగన్ అమరావతే రాజధాని అన్నారని గుర్తు చేశారు. ఇక్కడే ఇల్లు కూడా కట్టుకున్నానని జగన్ చెప్పారుని.. అధికారంలోకి వచ్చాక 3 రాజధానుల నాటకమాడారని విమర్శించారు. అమరావతి మందడంలో ‘తెలుగుజాతికి స్వర్ణయుగం – సంక్రాంతి సంకల్పం’ పేరిట భోగి మంటలు కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్తో కలిసి ఆయన పాల్గొన్నారు.
రాష్ట్రాన్ని మళ్లీ పునర్ నిర్మించుకోవాలని చంద్రబాబు అన్నారు. ఏపీని అభివృద్ధి చేసే బాధ్యత టీడీపీ-జనసేనది అని తెలిపారు. పాత వస్తువులు, పనికిరానివి భోగి మంటల్లో వేయడం సంప్రదాయం అని.. అందుకే ఇవాళ రాజకీయ హింస, అక్రమ కేసులు, మోసపు హామీలను భోగి మంటల్లో వేశామని చెప్పారు. పండుగ పూట కూడా అంగన్వాడీలు సమ్మె చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. పేదవాడికి సంపద సృష్టించడమే ధ్యేయంగా టీడీపీ, జనసేన పని చేస్తుందని వెల్లడించారు. టీడీపీ -జనసేన అధికారం ఖాయమని ప్రజలు నిర్ణయించుకున్నారని అన్నారు.
“ప్రజావేదికతో విధ్వంసానికి జగన్ నాంది పలికారు. జగన్‌కు ఐదేళ్లలో కూల్చడం తెలుసు నిర్మాణం చేతకాదు. చీకటి జీవోలతో రాష్ట్రాన్ని అంధకారం చేశారు. పేదలకు సంక్షేమ పాలన మళ్లీ అమరావతి నుంచే ప్రారంభం అవుతుంది”. అని చంద్రబాబు పేర్కొన్నారు.