వైసిపి ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు. మంగళగిరిలో మంగళవారం ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీలో గంజాయి పంట మినహా మిగిలిన పంటలన్నీ సంక్షోభంలో ఉన్నాయని విమర్శించారు చంద్రబాబు. ఏపీలో జగన్ ప్రభుత్వం సాగుని చంపేశారని.. రైతును చంపేశారని మండిపడ్డారు.
‘ప్రతిపక్షాలపై కేసులు.. వనరుల దోపిడీ’ ఇదే జగన్ పాలన అంటూ విరుచుకుపడ్డారు. ఏపీలో రైతు వెంటిలేటర్ మీదున్నాడని అన్నారు. కర్నూల్లో పత్తి, సీమలో వేరుశెనగ రైతు, గోదావరి జిల్లాల్లో ధాన్యం రైతు.. ఉత్తరాంధ్ర జీడి రైతు.. ఒక్కరైనా బాగున్నారా..? అని ప్రశ్నించారు. సీమలో హర్టికల్చర్.. కోస్తాలో ఆక్వా కల్చర్ కు మా హయాంలో ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. ఇప్పుడు ఆక్వా, హర్టికల్చర్ రైతులు ఆనందంగా ఉన్నారని తెలిపారు. ఏపీలో అద్భుతంగా సాగయ్యే పంట గంజాయి పంట అంటూ ఎద్దేవా చేశారు చంద్రబాబు.
నాలుగేళ్లల్లో మూడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వివరించారు. చేతగాని ప్రభుత్వం ఉంటే రైతులు ఎలా నష్టపోతారోననేది నాలుగేళ్ల జగన్ పాలనే నిదర్శనమన్నారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. సీమలో హర్టికల్చర్ పంటలను ప్రొత్సహించామన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్.. కోల్డ్ చెయిన్ లింకేజీ వ్యవస్థలను పటిష్ట పరచాలని కృషి చేశామన్నారు చంద్రబాబు. పులివెందుల్లో బత్తాయి పంటలు ఎండిపోకుండా నీరిచ్చామన్నారు. కానీ ఇప్పుడు ఆయిల్ ఫామ్ పంటలకు సబ్సిడీ లేదని ఆరోపించారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు టమాట పంటలేయడం మానేశారని అన్నారు. ఇప్పుడు టమాట ధరలు పెరగడానికి ఇదే కారణమని పేర్కొన్నారు.