చైనా దేశం తైవాన్‌పై ఏ క్షణమైనా విరుచుకు పడేందుకు రెడీగా ఉంది. ఈ క్రమంలోనే తైవాన్ కూడా చైనాను దీటుగా ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగానే.. వార్షిక వాన్ యాన్ ఎయిర్ రైడ్ డ్రిల్స్‌లో భాగంగా విపత్తు సమయాల్లో పౌరులు వ్యవహరించాల్సిన తీరుపై తైవాన్ రాజధాని తైపీ నగరంలో అధికారులు కసరత్తు నిర్వహించారు. రైల్వే స్టేషన్‌పై శత్రువులు వైమానిక దాడి చేసినట్టు ప్రత్యక్ష డ్రిల్ చేపట్టారు. ఆ సమయంలో అగ్నిమాపక దళాలు ఎలా వ్యవహరిస్తాయి? క్షతగాత్రులను ఎలా తరలిస్తాయి? అగ్నికీలలను ఎలా అదుపు చేస్తాయన్న విషయాలను అధికారులు పౌరులకు కళ్లకు కట్టినట్టు చూపించారు.
46వ వాన్ యాన్ డ్రిల్స్ సోమవారం నుంచి గురువారం వరకు కొనసాగనున్నాయి. స్వయం పాలిత ద్వీపమైన తైవాన్‌ను తమ భూభాగంగా పేర్కొంటున్న చైనా బలవంతంగానైనా తమ దేశంలో కలుపుకుంటామని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తరచూ తైవాన్ వైపు యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలను పంపుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో చైనా ఏ సమయంలోనైనా దాడికి పాల్పడే అవకాశం ఉందని భావిస్తున్న తైవాన్ డ్రాగన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది.