దుర్గగుడి వెండి రధం సింహాల ప్రతిమల మాయం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అయితే విచారణలో ఇప్పటివరకు 100 మందిని విచారించిన పోలీసులు ఎటువంటి క్లూ పట్టుకోలేక పోయారు. దీంతో ఏమి చేయాలో తెలీక తలలు పట్టుకుంటున్నారు పోలీసులు. 6 ప్రత్యేక బృందాలతో చోరీ కేసును దర్యాప్తు చేస్తున్న విజయవాడ పోలీసులు. ఘటన స్థలంలో ఫోరెన్సిక్ అధికారులు సేకరించిన ఆధారాల కోసం అధికారులు ఇప్పటిదాకా ఎదురు చూశారు.
అయితే ఫోరెన్సిక్ అధికారులకు కూడా అక్కడ చోరీకి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. కేసు దర్యాప్తులో పురోగతి ఏమీ కనిపించకపోవడంతో ఇది ఇంటి దొంగల పనేనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు మౌనం పాటిస్తునట్లు పలువురు ఆరోపణలు కూడా చేస్తున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు రథాన్ని ఉపయోగించ లేదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గతంలో పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ఘటన జరిగిందో, లేక ఇప్పుడు జరిగిందో విచారణలో తేలుతుందని పేర్కొన్న మంత్రి ఘటనపై కమిటీ వేస్తామని మంత్రి గతంలో ప్రకటించారు.