అభివృద్ధి చేస్తే ఏపీ కూడా తెలంగాణతో సమానంగా ముందుకెళ్తుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం పూర్తి చేస్తే ప్రతి ఎకరాకు నీరందుతుదని.. రూ.1667 కోట్లు ఖర్చు చేసి పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేశామని.. పట్టిసీమ పూర్తి చేయడం వల్ల రూ.44 వేల కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. తనకు పేరొస్తుందని వైసీపీ పాలనలో పట్టిసీమను కూడా సరిగా నిర్వహించలేదని ఆరోపించారు.
వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్ర విభజన నుంచి వైసీపీ పాలన వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించారు. 2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్‌ను నిలిపామని తెలిపారు. విజయవాడ, రాజమహేంద్రవరం, తిరుపతి, కడప విమానాశ్రయాలు అభివృద్ధి చేశామని.. రాష్ట్రంలో 8 లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చామని వెల్లడించారు. ఎన్ని ఇబ్బందులున్నా గతంలో సంక్షేమానికి బడ్జెట్‌లో 34 శాతం ఖర్చు చేశామని పేర్కొన్నారు. టీడీపీ అధికారంలో కొనసాగి ఉంటే 2021 నాటికి పోలవరం పూర్తయ్యేదని చంద్రబాబు వివరించారు.