శుక్రవారం మంగళగిరి ఎయిమ్స్ వద్ద ఏకో పార్కులో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఈ సందర్భంగా చంద్రబాబు, రావి వేప చెట్లను నాటారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. తనకు ఎంతో ఇష్టమైన కార్యక్రమం వన మహోత్సవం అని తెలిపారు.
వన మహోత్సవం ఎంతో మహత్తరమైన కార్యక్రమం అని.. ఏ పని చేసినా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటామని తెలిపారు. పచ్చదనం ఆవశ్యకతని విద్యార్థులంతా గ్రహించాలని అన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో పచ్చదనం 50% పెరగాలన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ ఏటా రెండు మొక్కలు నాటాలని సూచించారు. ఒకప్పుడు ఇంకుడు గుంతలు తవ్వితే చాలామంది ఎగతాళి చేశారని.. కానీ భూగర్భ జలాలు పెరగాలంటే ఇంకుడు గుంతలు చాలా అవసరం అన్నారు.
అటవీ ప్రాంతం క్రమంగా తగ్గిపోతుందని.. పర్యావరణంలో పెను మార్పులు వస్తున్నాయన్నారు చంద్రబాబు. వైసిపి హయాంలో నదులు, చెరువులు, కొండలను ధ్వంసం చేశారని అన్నారు. ఇకనుండి అడవుల్లో అడుగుపెడితే స్మగ్లర్లకు అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు.