పరిస్థితులు చక్కదిద్దిన తర్వాతే విజయవాడ నుండి వెళ్తా : సీఎం చంద్రబాబు

-

వదర ప్రభావిత ప్రాంతాల్లో ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు విస్తృతంగా పర్యటించారు. బాధితుల ఇళ్ల వద్దకు నేరుగా వెళ్లి వారిని పలకరించి ధైర్యం చెప్పారు. ఇప్పటికీ తీవ్రత ఉన్న కొన్ని ప్రాంతాల్లో వరద నీరు ఉండటంతో జేసీబీపైనే తిరిగారు. కలెక్టర్లు, మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం కలెక్టరేట్ నుండి బయలుదేరి సింగ్ నగర్ ఫ్లై ఓవర్, జక్కంపూడి వెళ్లే మార్గం గుండా పైపుల రోడ్డు, వాంబే కాలనీల్లో పర్యటించారు. ఇందిరమ్మ కాలనీ వాసులను అడిగి ఇబ్బందులు తెలుసుకుకున్నారు. అక్కడి నుండి అజిత్ సింగ్ నగర్, జీఎం టవర్ వద్దకు చేరుకుని బాధితులతో మాట్లాడారు.

పాలు, ఆహారం, నీళ్లు అందాయా అని బాధితులను అడగ్గా.. ఉదయాన్నే అల్పాహారం, మధ్యాహ్నం భోజనంతో పాటు పళ్లు అందాయని సీఎంకు తెలిపారు. ఇళ్లలో బురద చేరి ఇబ్బందులు పడుతున్నామని సీఎంతో మహిళలు చెప్పగా.. ఫైర్ ఇంజన్లతో ఇళ్లన్నీ క్లీన్ చేయించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ఎవరూ అధైర్య పడొద్దని తెలిపారు. రేపటి నుండి నిత్యవసర సరకులు కూడా అందిస్తామని, ప్రతి ఒక్కరినీ ఆదుకునే బాధ్యత తనదని చెప్పారు. జీఎం టవర్ వద్ద పలువురు వస్త్ర, షోరూం నిర్వహకులు కలిసి తమ సమస్యను విన్నవించుకున్నారు. షాపుల్లో వస్త్రాలు, ఇతర సామాగ్రి అంతా పాడైపోయిందని, తాము అన్ని విధాలా నష్టపోయామని వాపోయారు. మిమ్మల్ని ఆదుకోవాలన్న ఉద్దేశ్యంతోనే ఇప్పటికే 23 బీమా సంస్థలతోనూ చర్చిస్తున్నామని, ఏ విధంగా ఆదుకోవాలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పరిస్థితులన్నీ చక్కదిద్ది మీ అందరినీ మళ్లీ యధాస్థితికి తీసుకొచ్చాకే విజయవాడ నుండి తాను కదులుతానని బాధితులకు సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version