పోలవరం పై తాజాగా సీఎం చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ 20 రోజుల్లో 7 అంశాలపై శ్వేత పత్రాలు విడుదల చేస్తామని తెలిపారు. పోలవరం రాష్ట్ర ప్రజల జీవనాడి అని పేర్కొన్నారు. సముద్రంలో వృధాగా కలిసి 3 వేల టీఎంసీల నీటిని ఒడిసిపట్టి కరవురహిత రాష్ట్రంగా మార్చే ప్రాజెక్టు పోలవరం అని తెలిపారు.
బెల్టు స్థిరీకరణతోపాటు ఉత్తరాంధ్ర, రాయలసీమకు త్రాగునీరు, సాగునీరు అందించే బహుళార్థసాధక జాతీయ ప్రాజెక్టు. వరదల నివారణతోపాటు చౌకగా జలవిద్యుత్ అందించే ప్రాజెక్టు ఇది. 2014 రాష్ట్ర విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం కంటే 5 సంవత్సరాల జగన్ పాలన వల్ల ఎక్కువ నష్టం జరిగిందనే దానికి ఒక ఉదాహరణ పోలవరం విధ్వంసం అన్నారు చంద్రబాబు. 194 టీఎంసీల నీటి నిలువ. 322 టీఎంసీల నీటి సద్వినియోగం, 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు, 23.50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, 28.50 లక్షల జనాభా త్రాగునీరు, 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, వాటర్ టూరిజం అంటూ స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసుకుంటే వ్యవసాయానికి చాలా ఉపయోగపడుతుందని తెలిపారు.