తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. రాజమహేంద్రవరంలో వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపుదల కార్యక్రమంలో పాల్గొననున్నారు. తాడేపల్లి నుంచి హెలికాఫ్టర్లో బయలుదేరి ఉదయం 11 గంటలకు రాజమహేంద్రవరం మున్సిపల్ స్టేడియం చేరుకుంటారు. అక్కడి నుంచి ఆర్ట్స్ కళాశాల మైదానం వరకు నాలుగు కిలోమీటర్లు రోడ్డు షోలో సీఎం జగన్ పాల్గొంటారు.
ఈ కార్యక్రమానికి లక్ష మందిని సమీకరిస్తున్నారు. 11 గంటల 20 నిమిషాలకు సభా ప్రాంగణానికి చేరుకొని.. స్టాల్స్ సందర్శన, లబ్దిదారుల ముఖాముఖి కార్యక్రమాల్లో జగన్ పాల్గొంటారు. తర్వాత బహిరంగసభలో మాట్లాడతారు. మధ్యాహ్నం ఒంటిగంట 40 నిమిషాలకు రాజమహేంద్రవరం మున్సిపల్ స్టేడియం నుంచి హెలికాఫ్టర్లో తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
సీఎం సభకు 7 నియోజకవర్గాల నుంచి 420 ఆర్టీసీ బస్సులు, 180 ప్రైవేటు బస్సులుఏర్పాటు చేశారు. ప్రైవేటు విద్యాలయాలకు చెందిన మరికొన్ని బస్సులను సమీకరించారు. సీఎం పర్యటన దృష్ట్యా తూర్పు గోదావరి జిల్లాలో 1564 ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలకు నేడు సెలవులు ప్రకటించారు.