ఏపీలో నిన్నటి నుంచి కొత్త జిల్లాల పరిపాలన ప్రారంభమైంది. నిన్న ఉదయం 9 గంటల సమయంలో సీఎం జగన్ చేతుల మీదుగా 26 జిల్లాల పరిపాలన ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఇరవై ఆరు జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు బాధ్యతలు చేపట్టారు. అయితే 26 జిల్లాల ప్రారంభం రోజునే…. ఏపీలో మార్కెట్ విలువలను పెంచుతూ రిజిస్ట్రేషన్ చార్జీల పెంపునకు జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
మార్కెట్ విలువల పెంపునకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కొత్త జిల్లాల కేంద్రాలకు రిజిస్ట్రేషన్ చార్జీలను సవరిస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్. ఈ మేరకు సోమవారం స్పెషల్ సి ఎస్ రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు.
13 కొత్త జిల్లాలలో మాత్రమే చార్జీల సవరణ వర్తిస్తుందని ఆయన వివరించారు. అర్బన్ అలాగే రూరల్ మార్కెట్ విలువ సవరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త జిల్లాలో 15 శాతం వరకు ఈ పెంపు ఉండగా… మొత్తంగా సగటున 20 శాతం పైనే రిజిస్ట్రేషన్ విలువలు పెరిగాయి. ఈ పెంచిన రిజిస్ట్రేషన్ విలువలు బుధవారం నుంచే అమల్లోకి రానున్నాయి. దీంతో ఏపీలో భూముల ధరలకు రెక్కలు రానున్నాయి.