ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు తీపి కబురు అందించారు. ఎంత మంది పిల్లలు ఉన్నా ప్రసూతి సెలవులు ఇస్తామని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇద్దరూ పిల్లల వరకే ప్రసూతి సెలవులు ఉండగా.. ఇప్పటి నుంచి ఎంత మందికైనా హాలీడేస్ ఇస్తామన్నారు. గతంలో అధిక సంతానం వద్దని తానే చెప్పానని.. ఇప్పుడు పిల్లలు కనాలని చెబుతున్నట్టు వెల్లడించారు. అలాగే ఎంత మంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం చంద్రబాబు మహిళలతో ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో అధిక సంతానం వద్దని తానే చెప్పాను. దేశం అలా చెప్పాల్సి వచ్చింది. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పిల్లలను ఎంత వీలుంటే అంత కనాలని చెబుతున్నానని తెలిపారు సీఎం చంద్రబాబు.