బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో అత్యంత భారీ వానలు పడుతుండటంతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. చాలా జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు రాష్ట్రంలో మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అధికారుల ప్రకటనతో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రి అనిత అధికారులను అప్రమత్తం చేశారు.
ప్రజలకు నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వర్షాలు, వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ఏలూరు, అనకాపల్లి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. మరోవైపు అల్పపీడనం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది.ఏకధాటిగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు.