ఫెంగల్ తుపాను పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని తాకింది. మహాబలిపురం-కరైకల్ మధ్య పుదుచ్చేరి సమీపంలో తుపాను తీరం దాటే ప్రక్రియ ప్రారంభం అయినట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది తీరాన్ని పూర్తిగా దాటేందుకు దాదాపు 3 గంటల సమయం పడుతుందని.. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. తుఫాన్ తీరాన్ని తాకుతున్నన సమయంలో గంటకు 80-90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
ముఖ్యంగా రాత్రి 11.30 గంటల వరకు తీవ్ర వాయుగుండంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఏపీలోని కడప, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో ఇప్పటికే పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు 20 సెం.మీ. వర్షపాతంతో పాటు అకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వాహణ సంస్థ అధికారులు తెలిపారు.