బీఆర్ఎస్ నేతల మాయమాటలు నమ్మి అభివృద్ధిని అడ్డుకోవద్దని పాలమూరు జిల్లా ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇవాళ మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసిన రైతు పండుగ సభలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ సహా తాను ఎవ్వరి బెదిరింపులకు భయపడనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాను భయపడితే ఇంత దూరం రానని.. పుట్టింది, పెరిగింది నల్లమల్ల అడవుల్లో అన్నారు. పులులను చూశా.. అడవిలో ఉండే అన్ని మృగాలను చూశాను. తోడేళ్లను చూశా. అన్నింటినీ ఎదుర్కొని ఇంత దూరం వచ్చా.. మానవ మృగాలు మీరెంత..? నా కాలు గోటితో సమానం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను ప్రభుత్వాన్ని పాలించే పనిలో పడితే.. అలుసుగా తీసుకొని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ప్రజలే వారికి సమాధానం చెప్పాలన్నారు. పాలమూరు జిల్లా పై బీఆర్ఎస్ నేతలు మొసరి కన్నీరు కారుస్తూ.. కపట ప్రేమ చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడే పుట్టినోడిని.. చనిపోతే ఈ మట్టిలో కలిసేటోడిని.. సీఎంగా ఉ:డి నా జిల్లాకు ఏమి చేసుకోకపోతే నిధులు, నీళ్లు ఇవ్వకపోతే చరిత్ర నన్ను క్షమిస్తుందా..? ఎవ్వరూ అడ్డం వచ్చినా తొక్కుకుంటూ జిల్లాకు నిధులు తీసుకొస్తానని.. నీళ్లు పారిస్తానని.. కొడంగల్ లో పారిశ్రామిక వాడను తెచ్చి 25వేల ఉద్యోగాలు ఇప్పిస్తానని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.