స్కిల్ డెవలప్మెంట్ సంస్థ నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టయిన విషయం తెలిసిందే. ఆయన పోలీసు కస్టడీకి ఇచ్చే వ్యవహారంపై ఇవాళ ఏసీబీ కోర్టు నిర్ణయం వెల్లడించనుంది. తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్, దాని ఆధారంగా అనిశా కోర్టు జారీ చేసిన రిమాండ్ ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై శుక్రవారమే హైకోర్టు నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉందేమో వేచి చూద్దామని ఏసీబీ కోర్టు పేర్కొంది. ఒకవేళ శుక్రవారం హైకోర్టు నిర్ణయం లేకపోతే పోలీసు కస్టడీపై తామే ఉదయం 10.30 గంటలకు నిర్ణయం వెల్లడిస్తానని ఏసీబీ కోర్టు వెల్లడించింది.
చంద్రబాబును 5 రోజులపాటు పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీఐడీ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై ఈ నెల 20వ తేదీన సుదీర్ఘ వాదనలు జరగ్గా.. 21న నిర్ణయం వెల్లడిస్తామని ఏసీబీ కోర్టు తెలిపింది. 21న జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టులో క్వాష్ పిటిషన్‌పై శుక్రవారం నిర్ణయం వెల్లడించే అవకాశం ఉన్నందున అప్పటివరకు వేచి చూద్దామని, లేకపోతే ఉదయం 10.30 గంటలకు నిర్ణయం వెల్లడిస్తానని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది.