119 నియోజకవర్గాలకు 300 అభ్యర్థుల పేర్లు రెడీ చేసిన కాంగ్రెస్

-

తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పట్టుదలతో కనిపిస్తోంది. ఆ దిశగా పటిష్ఠ ప్రణాళికలతో వ్యూహప్రతివ్యూహాలతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. ఓవైపు ఆ గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకువెళ్తూనే మరోవైపు రానున్న అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసే పనిలో పడింది.

ఈ క్రమంలోనే గురువారం రోజున తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ దిల్లీలో సమావేశమైంది. స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేశారు. 119 నియోజకవర్గాలకు గాను దాదాపు 300 పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ 300 పేర్లను స్క్రీనింగ్ కమిటీకి సిఫారసు చేయగా.. ఈ జాబితాను పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి స్క్రీనింగ్‌ కమిటీ నివేదించనుంది.

సర్వేలు, సామాజిక, స్థానిక రాజకీయ స్థితిగతుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. అభ్యర్థులలో ప్రత్యర్థులతో తలపడే శక్తిసామర్థ్యం ఉందా లేదా కోణంలోనూ సర్వే నిర్వహించినట్లు సమాచారం. 25 నుంచి 30 చోట్ల ఇద్దరి పేర్లు, దాదాపు 50 నియోజకవర్గాలకు ముగ్గురు, మరో 10 నుంచి 14 నియోజకవర్గాలకు నలుగురి పేర్లను.. స్క్రీనింగ్ కమిటీకి పీఈసీ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఈ మొత్తంగా కలిపి దాదాపు 300 మంది పేర్లను ప్రదేశ్ ఎన్నికల కమిటీ.. స్క్రీనింగ్ కమిటీకి సిఫార్సు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news