ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అపారమైన అవకాశాలు, వనరులు ఉన్నాయని అబుదాబికి చెందిన ఎం42 సంస్థ ప్రతినిధులకు వివరించామని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ, వైద్య విద్యా శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మంగళగిరి ఎపిఐఐసి టవర్స్ లోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో ఆ సంస్థ ప్రతినిధులతో గురువారం సమావేశమైన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశమున్న రంగాలపై జినోమిక్స్, పర్యావరణ మెడ్ టెక్, బయోటెక్ విభాగాల్లో అపారమైన అనుభవమున్న ఎంఎఫ్2 సంస్థతో ప్రాథమికంగా చర్చించామన్నారు.
వ్యాపారపరంగా, సేవా పరంగా ఏపీలో ఉన్న అవకాశాల్ని సంస్థ ప్రతినిధులకు వివరించామన్నారు. ఏపీలో బల్క్ డ్రగ్ పార్క్ మొదటి స్థానంలో ఉన్నవిషయాన్ని, అలాగే సుమారు 170 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఎపి మెడ్ టెక్ జోన్, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 3 ఎకనమిక్ జోన్లలో పెట్టుబడులు పెట్టేందుకు మెండుగా ఉన్న అవకాశాలపైనా వారితో చర్చించామన్నారు. అమరావతి ప్రాంతంలో హెల్త్ సిటీలో గానీ, ఎంపిక చేసిన 9 మునిసిపాలిటీల్లో హెల్త్ హబ్ లలో కూడా పెట్టుబడులు పెట్టేందుకు అవకాశముందని మంత్రి సత్యకుమార్ చెప్పారు.
ఆసుపత్రుల నిర్మాణాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహాన్ని కనబర్చడమే కాకుండా ప్రజల జీవన ప్రమాణాల్ని మెరుగుపర్చే సరికొత్త టెక్నాలజీ అయిన జీనోమ్ సీక్వెన్సీ గురించి ఈ సందర్భంగా ప్రస్తావనకొచ్చిందన్నారు. ఎకనమిక్ కారిడార్లు, మెడ్ టెక్ జోన్ లలో ఎంఎఫ్2 ప్రతినిధులు క్షేత్ర స్థాయి పర్యటన చేశాక సంబంధిత అధికారులతో కూలంకషంగా చర్చించిన మీదట తుది నివేదికను అందజేస్తారన్నారు. పలు దఫాలుగా సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యాక రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాన్ని కుదుర్చుకుంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలాన్ని అందజేస్తామని సంస్థ ప్రతినిధులకు చెప్పామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తామని, అవసరమైన రాయితీల్ని కూడా ఇస్తామని మంత్రి తెలిపారు.