విజయవాడలో సంభవించిన వరద ప్రమాదానికి బుడమేరు గేట్లు తెరవడమే కారణమని సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేయడంపై ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరకట్ట సేఫ్టీ కోసం బుడమేరు గేట్లు తెరిచారని కొందరు అదే పనిగా ప్రచారం చేస్తున్నారని, అందులో ఎలాంటి వాస్తవం లేదని నారా లోకేశ్ చెప్పుకొచ్చారు. తప్పుడు వీడియోలు షేర్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వరదల్లో చిక్కుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సామాన్య ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతుంటే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సహాయక చర్యల్లో నిమగ్నమైందన్నారు.
కానీ కొందరు కావాలనే ప్రభత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి లోకేశ్ మండిపడ్డారు. బంగ్లాదేశ్‌లోని వరదలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అవి విజయవాడలో సంభవించిన వరదలుగా చిత్రీకరించడం ఏంటని ధ్వజమెత్తారు. ఆ ఫోటోలను చూపించి సామాన్యులను భయభ్రాంతులకు గురి చేసేలా ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని మంత్రి లోకేశ్ మండిపడ్డారు.